ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రత్యేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంతో పాటు జైపూర్, పాట్నాలోనూ ప్రత్యేక NIA కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. NIA దర్యాప్తు చేసిన ఉగ్రవాదం, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి.
ఉగ్రవాద కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు కేసులను సత్వరంగా పరిష్కరించడమే ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. NIA చట్టం–2008లోని సెక్షన్ 11 ప్రకారం ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
విశాఖపట్నంలో ప్రత్యేక NIA కోర్టు అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ భద్రతకు సంబంధించిన కేసుల విచారణకు మరింత ప్రాధాన్యత లభించనుంది. NIA దర్యాప్తు చేసే కీలక కేసులను ప్రత్యేక కోర్టులో విచారించడం ద్వారా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.









