మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు, రేపు ఆయన పులివెందులలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పులివెందులకు చేరుకున్న అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
ప్రజా దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను జగన్ కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు. రేపు ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి 7.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా నివాళులు అర్పించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ వర్గాలు పూర్తి చేశాయి. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.









