జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహిళా అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. పవన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సాధారణంగా సంక్రాంతి, నూతన సంవత్సరం వంటి పండుగల సందర్భంగా ఇళ్ల ముందు ముగ్గులు వేసి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీ. అయితే పవన్ పుట్టినరోజు సందర్భంగా అదే తరహాలో ముగ్గులు వేయడం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అమలాపురంలోని రవణం వీధిలో మహిళలు తమ ఇళ్ల వాకిట్లో ‘హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్’, ‘హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం’ అంటూ అందమైన ముగ్గులు వేశారు. వివిధ రంగులతో ఆకర్షణీయమైన డిజైన్లు రూపొందించి పవన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ముగ్గుల్లో పవన్ కళ్యాణ్ నటించిన పలు సినిమాల పేర్లను కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు.
‘బద్రి’, ‘జల్సా’, ‘ఓజీ’, ‘పంజా’, ‘బాలు’, ‘తొలిప్రేమ’ వంటి పవన్ కళ్యాణ్ సినిమాల పేర్లను ముగ్గుల చుట్టూ రంగులతో అందంగా అలంకరించారు. దీంతో ఈ వినూత్నమైన ముగ్గులు స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా మహిళా అభిమానులు ఇలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడం జనసేన, పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.









