చిత్తూరు జిల్లా పుంగనూరు, మంగళంపేట అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏనుగులతో కూడిన గుంపులో ఒక మగ ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మంగళంపేట పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బోర్వెల్ మోటార్కు అనుసంధానించిన విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఏనుగు విద్యుత్ షాక్కు గురై మృతి చెంది ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఏనుగు మృతికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. ఘటనపై అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించి.. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.
వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం మృత ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఏనుగు మృతికి దారితీసిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.









