తెలంగాణలో 1,931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు.. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల!

తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను తదుపరి దశకు షార్ట్‌లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెంగల్‌రావ్‌నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఈ ప్రక్రియ జరగనుంది.

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. ఇందుకోసం అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల ఫొటోకాపీలను తీసుకురావాలని MHSRB సూచించింది. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు లేదా అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించలేని వారి కోసం సెప్టెంబర్ 28ను రిజర్వ్ డేగా కేటాయించారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సూచించింది. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్లు MHSRB వెల్లడించింది. దీంతో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు