ఏపీ క్యాబినెట్ సమావేశానికి ముందు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ పార్టీకి చెందిన మంత్రులతో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త పింఛన్లు, ప్రభుత్వ శాఖల పనితీరు, రైతులు-ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుంచి దశల వారీగా కొత్త పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని లోకేష్ పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్లోగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న అంశాలను కూడా త్వరగా పరిష్కరించి ఎన్నికలు నిర్వహించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత పురపాలక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని నారా లోకేష్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడితే ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి ఆర్థిక నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.









