రాహుల్‌ గాంధీకి కొండా సురేఖ సంచలన లేఖ రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..

రాహుల్‌ గాంధీకి కొండా సురేఖ సంచలన లేఖ..? రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు..!

గత కొద్దిసేపటి క్రితం మంత్రివర్గం నుంచి తీసివేయబడ్డ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కాంగ్రెస్ దగ్గర నేత రాహుల్ గాంధీకి ఒక లేఖను పంపినట్టు తెలియ వచ్చింది.

మంత్రిగా తన నిర్ణయాధికారాన్ని క్రమంగా తగ్గిస్తున్నారని కొండా సురేఖ  ఆరోపించారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తనను సంప్రదించకుండానే సీఎం  కార్యాలయం నుంచి జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు.

అదేవిధంగా యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కనీస సమాచారం కూడా తనకు ఇవ్వలేదన్నారు. సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధికి విడుదలైన నిధులను తనకు తెలియకుండానే ఒక్కరోజులో ఆర్‌అండ్‌బీ శాఖకు బదిలీ చేశారని ఆరోపించారు.

శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో తన ఫొటోను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ మంత్రిగా తనకు కనీస గుర్తింపు, గౌరవం కూడా దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు.

తన మాజీ ఓఎస్డీ సుమంత్‌ను సమాచారం ఇవ్వకుండానే పదవి నుంచి తొలగించారని తెలిపారు. అనంతరం పోలీసులు తన నివాసానికి వచ్చి సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని, మరో నాన్‌బెయిలబుల్ కేసులోనూ ఇరికిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉంటే వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు. పొరుగు నియోజకవర్గాలకు నిధులు వస్తున్నా, వరంగల్ స్మార్ట్ సిటీ మోడల్ బస్‌స్టాండ్, బొందివాగు విస్తరణ సహా కీలక పనులకు నిధుల మంజూరు, విడుదల ఆలస్యమవుతోందన్నారు..

ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని లేఖలో వెల్లడించారు.

జగ్గా రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుందని సీఎం చెప్పారని, మరోవైపు పరకాల సభలో రేవూరి ప్రకాశ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారని గుర్తుచేశారు. ఒకే పార్టీలో నేతలకు వేర్వేరు రాజకీయ ప్రమాణాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

వరంగల్ జిల్లాలో కొందరు నేతలు సీఎం ప్రోత్సాహం, మద్దతుతో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలను టీపీసీసీ నాయకత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.తన వయోజన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడంపైనా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై పెరుగుతున్న రాజకీయ, పరిపాలనా ఒత్తిడి తీవ్ర మానసిక వేదనకు కారణమైందన్నారు.

బీసీ మహిళా మంత్రిగా తనను రాజకీయంగా, పరిపాలనాపరంగా పక్కనపెడుతున్నారని సురేఖ ఆరోపించారు. బీసీ నాయకత్వాన్ని అణచివేసే విస్తృత ధోరణిలో భాగంగానే తాజా పరిణామాలను పలువురు చూస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.

కాగా మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ కోసం పనిచేశానని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రజల విశ్వాసం పొందానని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తన శాఖల బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తున్నప్పటికీ తన మంత్రి పాత్రను నామమాత్రంగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం వ్యవహారంపై నిష్పాక్షిక, సమగ్ర విచారణకు ఆదేశించాలని రాహుల్ గాంధీని కోరారు. తన ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా సమర్పించినట్లు లేఖలో వెల్లడించారు.

 

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు