ఆర్థిక నివేదికల ఆధారంగా అభివృద్ధి చర్యలు చేపట్టాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా సమర్పించే ఆర్థిక నివేదికల ఆధారంగా వివిధ రంగాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నెల ఆర్థిక నివేదికను ప్రణాళిక శాఖ అధికారులు సీఎంకు సమర్పించగా, క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వివిధ రంగాల పనితీరు, ద్రవ్యోల్బణంపై సమీక్షించారు. ఆర్థిక ప్రగతి క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఆర్థిక నివేదికలను సమీక్షించడంతో పాటు, వాటి ఆధారంగా శాఖల పనితీరులో అవసరమైన మార్పులు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో వృద్ధి కనిపిస్తోందని, అదే విధంగా సేవలు, పరిశ్రమల రంగాలు కూడా పుంజుకోవాలని అన్నారు. నివేదికలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందించి, లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ రంగాల్లో నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాలని ఆదేశించారు.

నియోజకవర్గాల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న అవకాశాలను గుర్తించి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలను ప్రపంచ మార్కెట్లకు చేరువ చేయాలని సూచించారు. ఈ దిశగా నియోజకవర్గాల్లో విజన్ యూనిట్ ప్రణాళికలను అమలు చేయాలని, ధరలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు