తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, దీంతో ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 12న సచివాలయంలో మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను సీఎం సమీక్షించనున్నారు. ముఖ్యంగా కరవు ఛాయలు అలముకున్న ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటల పరిస్థితి, వ్యవసాయ రంగంపై వర్షాభావ ప్రభావం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు అందించే వివరాలను పరిశీలించనున్నారు.
వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం దృష్టి సారించనుంది.









