పోలవరం నియోజకవర్గ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. 2023లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు.. ఎవరూ రోడ్లపైకి రాలేదని, ఆ క్లిష్ట సమయంలో జనసేన సైనికులు, వీర మహిళలు మాత్రమే రోడ్లెక్కి నిరసనలు చేసి యావత్ రాష్ట్ర ప్రజలకు కొండంత ధైర్యాన్ని, భరోసానిచ్చారని పవన్ పేర్కొన్నారు. పైకి కూటమి సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, పవన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలోని టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహావేశాలను రగిలించాయి.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ కేడర్ గట్టిగా ఎదురుదాడికి దిగుతోంది. “బాబు అరెస్ట్ సమయంలో పవన్ కల్యాణ్ రోడ్డుపై బైఠాయించి, రాజమండ్రి జైలుకు వచ్చి అండగా నిలబడ్డారనే గౌరవం, కృతజ్ఞత మాకు ఉన్నాయి.. కానీ ఏ ఊర్లో జనసైనికులు రోడ్డెక్కారో చెప్పండి మాస్టారూ?” అంటూ తెలుగు తమ్ముళ్లు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తింటూ, అరెస్టులవుతూ ప్రాణాలకు తెగించి పోరాడారని, అలాంటి త్యాగాలను పూర్తిగా విస్మరించి క్రెడిట్ అంతా జనసేన ఖాతాలో వేసుకోవాలని చూడటం తమను తీవ్రంగా కించపరచడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం పవన్ కల్యాణ్ రాజమండ్రి వేదికగా పొత్తు ప్రకటించడం కూటమి విజయానికి బలమైన పునాది వేసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. టీడీపీ కార్యకర్తల శ్రమను ఏమాత్రం పట్టించుకోకుండా “ఎవరూ బయటకు రాలేదు” అనడం భావ్యం కాదని పసుపు కేడర్ మండిపడుతోంది. కూటమి ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీలపైనా ఉందని, ఇలాంటి ఏకపక్ష ప్రకటనలు క్షేత్రస్థాయిలో విభేదాలను మరింత పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇరు పార్టీల మధ్య కొత్త క్రెడిట్ వార్‌కు దారితీసింది.









