కమిషన్ల కోసమే సింగరేణిని దోచుకుంటున్నారు: రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాలు, భారీ కమిషన్ల కోసమే సింగరేణి సంస్థను వాటాలు వేసుకుని నిలువునా దోచుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న నిర్వహించిన భారీ ‘సింగరేణి కార్మిక గర్జన’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సింగరేణి సంస్థ సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ లేదని, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం, అవినీతి విధానాల వల్ల శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సంస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నైని బొగ్గు బ్లాక్ టెండర్లలో ప్రభుత్వ పెద్దల మధ్య కమిషన్ల లెక్కలు తేలకపోవడం వల్లే ఆ టెండర్లను రద్దు చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. నైని టెండర్ల రద్దుతో ప్రభుత్వానికి రూ.30,000 కోట్లు ఆదా చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. పాలకుల మధ్య పంపకాలు కుదరనప్పుడే ఇలాంటి అక్రమాలు రచ్చకెక్కుతాయని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చి సింగరేణిలో సుమారు రూ.10,000 కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. సోలార్ పవర్ ప్రాజెక్టులు, జిలెటిన్ స్టిక్స్ కొనుగోళ్లతో పాటు మరో నాలుగైదు కీలక అంశాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని, వారి జీవితాలను నాశనం చేస్తున్న ఈ అక్రమాలపై సమగ్ర ఆధారాలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి అధికారికంగా లేఖ రాశామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే సింగరేణిలో సాగుతున్న దోపిడీపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికార పార్టీ నేతలు ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటూ సంస్థను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సింగరేణి పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు