కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్పై సంతకం చేయాలనే షరతుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘తిరంగా మార్చ్’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్దకు నిరసనకారులు చేరుకోవాలని అభిజీత్ దీప్కే కోరారు. అయితే, మార్చ్ నిర్వహించకముందే ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్లు 126, 170 కింద శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందనే ఆరోపణలతో పోలీసులు దీప్కేను అరెస్ట్ చేశారు. అనంతరం శనివారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన కస్టడీ నుంచి విడుదల కానున్నారు.









