కీసర పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ కేసు.. రూ.2.28 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

మేడ్చల్‌-మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. సుమారు రూ.2.28 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.
అక్టోబర్ 17, 2026న కేసు నమోదు చేసిన ఏసీబీ.. ఇన్‌స్పెక్టర్ నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు సంబంధించిన మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
సరూర్‌నగర్‌లోని లింగోజిగూడలో రెండు ప్లాట్లు, ఎల్‌బీనగర్‌ సీఆర్ ఎన్‌క్లేవ్‌లో ఇల్లు, పేరూర్‌లో నిర్మాణంలో ఉన్న ఇల్లు, మిర్యాలగూడ హాలియాలో రెండెకరాల వ్యవసాయ భూమిని గుర్తించింది. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు కాగా, మరిన్ని భూములు ఉన్నట్లు విచారణలో తేలింది.
సోదాల్లో రూ.7 లక్షల నగదు, 60 తులాల బంగారం, రూ.6.5 లక్షల విలువైన మారుతి విటారా బ్రెజా కారు, రూ.10 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించింది. ఆస్తుల మార్కెట్ విలువ అధికారిక అంచనాల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ తెలిపింది.
గత సెప్టెంబర్ 16న రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసి, ఎస్‌ఐ డి.జ్ఞానేందర్ రెడ్డి ద్వారా రూ.5 లక్షలు తీసుకున్న ఆరోపణలపై ఆంజనేయులును ఏసీబీ పట్టుకుంది. సెప్టెంబర్ 17న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అక్రమాస్తుల కేసుపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు