హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని, తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు, ఒప్పందం ఖరారయ్యే వరకు నౌకల కదలికలపై ఈ విరామం తీసుకున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
అమెరికా దాడుల వల్ల ఇరాన్ నావికా మరియు వైమానిక దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారి సైనిక శక్తి సర్వనాశనం కావడంతోనే చర్చలకు ముందుకు వస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, ఈ క్రమంలో ఒప్పందం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను తాత్కాలికంగా పక్కన పెట్టినప్పటికీ, ఇరాన్‌పై విధించిన ఆర్థిక దిగ్బంధనం మాత్రం యథావిధిగా కొనసాగుతుందని ఆయన ఖరాఖండిగా చెప్పారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రస్తుతం అమెరికా దళాల నియంత్రణలోనే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ధృవీకరించారు. ఇరాన్‌తో జరగబోయే చర్చల ఫలితాన్ని బట్టి తదుపరి వ్యూహాలు ఉంటాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్న ఈ వివాదంలో ట్రంప్ తీసుకున్న ఈ తాత్కాలిక విరామం శాంతి ఒప్పందానికి దారితీస్తుందో లేదో వేచి చూడాలి.









