తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘దళపతి’ జోసెఫ్ విజయ్ మొదటిసారిగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో శుక్రవారం పర్యటించనున్నారు. సుమారు 1200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ కొల్లూరు మూకాంబికా దేవి ఆలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం మధ్యాహ్నం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి మంగళూరు చేరుకునే విజయ్.. అక్కడ నుండి రోడ్డు మార్గంలో ఉడుపి జిల్లాలోని కొల్లూరు ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన అనంతరం, సాయంత్రానికి తిరిగి చెన్నై ప్రయాణమవుతారు. సీఎం విజయ్ పర్యటన నేపథ్యంలో మార్గమధ్యంలో అభిమానులు భారీగా గుమిగూడే అవకాశం ఉండటంతో కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజకీయ రంగంలో ఉన్నవారు కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటే తాము ఎంచుకున్న రంగంలో తిరుగులేని విజయం సాధిస్తారని ప్రముఖుల నమ్మకం. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో తమిళనాడు దిగ్గజ నేత ఎం.జి. రామచంద్రన్ (MGR) ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా, అమ్మవారికి కిలోన్నర బరువున్న ‘సువర్ణ ఖడ్గాన్ని’ (బంగారు కత్తి) కానుకగా సమర్పించారు. ఆయన తర్వాత సీఎం అయిన ఆయన భార్య జానకీ రామచంద్రన్, అలాగే దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. జయలలిత ఇక్కడ ప్రత్యేకంగా చండీయాగం నిర్వహించి అన్నదానం కోసం నిధులు కూడా సమర్పించగా, ప్రస్తుత పర్యటనతో విజయ్ ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తున్నారు.
కర్ణాటకలోని ఏడు ప్రసిద్ధ ముక్తి స్థలాలలో ఒకటైన ఈ కొల్లూరు మూకాంబికా దేవి ఆలయం సౌపర్ణిక నదీ తీరంలోని కోడచాద్రి కొండలపై కొలువై ఉంది. పురాణాల ప్రకారం.. ఇక్కడి మునులను వేధించిన ‘మూకాసురుడు’ అనే రాక్షసుడిని పార్వతి దేవి సంహరించిన పవిత్ర స్థలం ఇది. ఆ తర్వాత కుడజాద్రి కొండలపై ఆది శంకరాచార్యులు ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షం కాగా.. ఆయన కోరిక మేరకు కొల్లూరులో మూకాంబికా దేవిగా ఇక్కడ వెలిసినట్లు భక్తుల నమ్మకం. శంకరాచార్యుల చేత స్వయంగా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగిన ఈ ఆలయ దర్శనార్థం ఏటా కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.








