అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట: విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు.. 21 పోస్టులు, నిధులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితుల కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విజయవాడలో ప్రత్యేక కోర్టు (స్పెషల్ కోర్టు) ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు నిర్వహణ కోసం జిల్లా జడ్జి, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సహా మొత్తం 21 పోస్టులను మంజూరు చేసింది. దీనితో పాటు కోర్టు ప్రాథమిక ఖర్చుల నిమిత్తం రూ. 5 లక్షలు, కోర్టులో ఫర్నీచర్ మరియు లైబ్రరీ ఏర్పాటు కోసం రూ. 10 లక్షల నిధులను కూడా ప్రభుత్వం కేటాయించింది. విజయవాడలో ఏర్పాటు కాబోయే ఈ ప్రత్యేక కోర్టులో అగ్రిగోల్డ్ కేసులతో పాటు ‘ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం’ కింద నమోదైన కేసులను విచారించనున్నారు.
వాస్తవానికి, డిపాజిటర్ల చట్టం కింద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని 2016లోనే నిర్ణయించారు. అప్పటి ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపినప్పటికీ, సాంకేతిక కారణాలు మరియు సిబ్బంది కేటాయింపుల్లో ఆలస్యం వల్ల ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవల ఏపీ సీఐడీ డీజీపీ అగ్రిగోల్డ్ కేసుల విచారణ కోసం ప్రత్యేక సిబ్బందిని మంజూరు చేయాలని కోరడంతో, ప్రస్తుత ప్రభుత్వం అన్ని వివరాలను పరిశీలించి ఈ 21 పోస్టులను మంజూరు చేసింది. గత నెలలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రిగోల్డ్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. బాధితులకు 6 నెలల్లోగా న్యాయం జరిగేలా చూడాలని, సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
1995లో ప్రారంభమైన అగ్రిగోల్డ్ సంస్థ.. అధిక వడ్డీలు, ప్లాట్లు ఇస్తామంటూ ఏజెంట్ల ద్వారా ఏపీ, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షల మంది బాధితుల నుండి వందల కోట్లు వసూలు చేసింది. అయితే 2014 నాటికి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో దాదాపు రూ. 6,000 కోట్ల మేర కుంభకోణం వెలుగుచూసింది. సీఐడీ, ఈడీలు రంగంలోకి దిగి సంస్థ ప్రమోటర్లను అరెస్ట్ చేసి, ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ చట్టపరమైన ఇబ్బందులు, కోర్టు కేసుల వల్ల గత పదేళ్లుగా బాధితులకు ఎలాంటి సొమ్ము అందలేదు. ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో కేసుల విచారణ వేగవంతమై, తమకు త్వరలోనే న్యాయం జరుగుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








