అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి ప్రధాన కారణమైన అణు కార్యక్రమం ఇక ఇంతటితో ముగిసిపోతుందని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదనే కఠినమైన షరతుతో ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతోందని ట్రంప్ వెల్లడించారు. శనివారం లేదా సోమవారం యూరప్ వేదికగా ఈ ఒప్పందాలపై సంతకాలు జరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఇరాన్ దీనిని తీవ్రంగా ఖండించింది. తమ అణు కార్యక్రమంపై రాజీ పడే సమస్యే లేదని, తమ వద్ద ఉన్న యురేనియాన్ని ఎవరికీ అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేయడంతో అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల హోర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ సైన్యం కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ఇరాన్‌పై వరుస మిస్సైల్ దాడులు చేపట్టిన అమెరికా, గురువారం రాత్రి ఇరాన్ భూభాగంపై భారీగా బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించింది. అయితే ఈ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ నెమ్మదించి రాజీ రాగం వినిపించడం గమనార్హం. ఈ ఒప్పందం పూర్తయిన వెంటనే అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా, గత కొన్ని నెలలుగా ఆ మార్గంలో లక్షలాది బ్యారెళ్ల చమురు నౌకలను అమెరికా సైన్యమే సురక్షితంగా దాటించిందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలన్నింటినీ ఇరాన్ విదేశాంగ శాఖ మరియు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘ఫార్స్’ పూర్తిగా తోసిపుచ్చాయి. ఇప్పటివరకు అమెరికాతో ఎలాంటి శాంతి ఒప్పందమూ కుదరలేదని ఇరాన్ తేల్చిచెప్పింది. హోర్మూజ్ జలసంధి ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ సైనిక నియంత్రణలోనే ఉందని, అది ఇంకా మూసివేసే ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మార్గంలో సురక్షిత నౌకాయానం సాధ్యం కాదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ఆదివారం వైట్ హౌస్‌లో జరగనున్న ఒక కార్యక్రమం కారణంగా తాను యూరప్‌లో జరిగే ఈ ఒప్పందానికి వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నానని ట్రంప్ ప్రకటించగా, అటు ఇరాన్ మాత్రం అణు సార్వభౌమత్వంపై వెనక్కి తగ్గేది లేదని భీష్మించడంతో ఈ శాంతి చర్చలు ఏ తీరానికి చేరుకుంటాయోననే ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.








