మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలుపెట్టింది. జూన్ 3వ తేదీ రాత్రి నుండి ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తన తల్లిదండ్రులతో కలిసి హాజరై అభిమానులను ఆశ్చర్యపరిచారు.
థియేటర్లో సినిమా ప్రదర్శన సమయంలో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వగానే ఉపాసన ఎంతో ఉత్సాహంగా గాల్లోకి పేపర్లు ఎగరేస్తూ, ఈలలు వేస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. క్రికెట్ గ్రౌండ్లో చరణ్ స్టైలిష్ ఎంట్రీకి అభిమానుల కేకలతో థియేటర్ అంతా దద్దరిల్లిపోగా, ఉపాసన కూడా వారితో కలిసి చేసిన హంగామా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భర్త స్క్రీన్ పై కనిపించిన ప్రతి సీన్ లోనూ ఆమె ముఖంలో అమితమైన ఆనందం కనిపించిందని, చరణ్‌కు ఆమె కంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరూ ఉండరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి మూడు వేర్వేరు క్రీడల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ ప్లేయర్ పాత్రలో అదరగొట్టారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ అచ్చియమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఉపాసన స్వయంగా థియేటర్‌కు వచ్చి సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం ‘పెద్ది’ సినిమా క్రేజ్‌ను మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.









