కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దేశంలో కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రతిపక్షాలు పగటి కలలు కంటున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు, హెచ్చరికలు కేవలం తాటాకు చప్పుళ్లు మాత్రమేనని, వాటికి ఎన్డీయే ప్రభుత్వం ఎంతమాత్రం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను విపక్షాలు తమ స్వార్థ రాజకీయాల కోసం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
పది నెలల్లో మోదీ సర్కార్ కూలిపోతుందంటూ కొన్ని పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన ప్రజా తీర్పును అగౌరవపరిచే హక్కు విపక్షాలకు లేదని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ప్రజలను అవమానించడమేనని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ 2029 వరకు పూర్తికాలం అధికారంలో కొనసాగేందుకు దేశ ప్రజలు తిరుగులేని మద్దతు ఇచ్చారని, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో అలజడులు సృష్టించి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న విపక్షాల దింపుడుకల్లం ఆశలు భారత్లో ఎప్పటికీ నెరవేరవని ఎద్దేవా చేశారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారతదేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అద్భుతమైన పనితీరును, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలతో అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా ఉందని, ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి తన ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Post Views: 2









