రాయచోటి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?: గడికోట శ్రీకాంత్‌రెడ్డికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్!

రాయచోటి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్వయంగా ప్రజల ముందే చూపిస్తానని, గత వైసీపీ పాలనలో శ్రీకాంత్‌రెడ్డి చేసిన పనులేంటో చూపించే దమ్ముందా అని నిలదీశారు.
గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. ముఖ్యంగా రూ.450 కోట్ల వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద ఆరు మండలాలకు తాగునీరు అందించే భారీ ప్రాజెక్టును వేగవంతం చేశామని, అలాగే రూ.420 కోట్ల అంచనా వ్యయంతో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రాయచోటికి దక్కాల్సిన అమృత్ పథకం నిధులను సైతం సద్వినియోగం చేసుకోకుండా వెనక్కి పంపించి ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు.
ఎన్నికలు సమీపించగానే శ్రీకాంత్‌రెడ్డి కార్యకర్తల పేరుతో చవకబారు రాజకీయాలు చేస్తూ, వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయాక నియోజకవర్గం ముఖం కూడా చూడని వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతున్నారని, దమ్ముంటే రానున్న 40 రోజులు ఇక్కడే ఉండి కార్యకర్తలకు అండగా నిలబడాలని ఆయన ప్రతిసవాల్ చేశారు. తాను 22 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రగతికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు