ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా సంస్థ అత్యంత అరుదైన సాంకేతికతతో కూడిన ‘ఫ్లయింగ్ కార్’ను విజయవంతంగా పరీక్షించింది. టెక్సాస్‌లోని మెక్‌గ్రెగర్‌లో ఉన్న స్పేస్ఎక్స్ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రంలో నెక్ట్స్ జనరేషన్ ‘రోడ్‌స్టర్ 2’ (Roadster 2) ఎలక్ట్రిక్ సూపర్‌కార్ డెమో ప్రదర్శనను కంపెనీ నిర్వహించింది. ప్రత్యేకంగా రూపొందించిన ర్యాంప్‌పై ఈ కారు భూమి నుంచి కొన్ని అడుగుల ఎత్తు గాలిలోకి ఎగిరి, అద్భుతమైన స్టంట్స్ చేసి తిరిగి సురక్షితంగా నేలపైకి దిగింది. “రియల్ లైఫ్, బేబీ” (Real life, baby) అంటూ టెస్లా అధికారికంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తుండగా.. భవిష్యత్తులో గాల్లో ఎగిరే కార్లు నిజరూపం దాల్చనున్నాయని ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు.
ఈ ఫ్లయింగ్ కారులో సంప్రదాయ ఇంజిన్ ఫ్యూయల్‌కు బదులుగా స్పేస్ఎక్స్ రాకెట్ టెక్నాలజీ ఆధారిత కోల్డ్ గ్యాస్ థ్రస్టర్స్ (Cold Gas Thrusters), ప్రత్యేక సక్షన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. అల్ట్రా హై-ప్రెజర్ గ్యాస్ ద్వారా ఉత్పన్నమయ్యే థ్రస్ట్ సహాయంతో ఈ సూపర్ కార్ కొద్దిసేపు గాలిలో తేలుతూ విన్యాసాలు చేయగలిగింది. సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో ఇలాంటి అద్భుతాలు అసాధ్యం కాగా, కేవలం 0.81 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. సుదీర్ఘకాల పరిశోధనల అనంతరం రూపొందించిన ఈ రాకెట్ వేరియంట్ సాంకేతికత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చర్చకు దారితీసింది.
రోడ్‌స్టర్ 2 మోడల్‌ను టెస్లా కంపెనీ తొలుత 2017లోనే ప్రకటించినప్పటికీ, వివిధ కారణాల వల్ల ఉత్పత్తిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ అధునాతన కార్లను 2028 నాటికి ఉత్పత్తి దశకు తీసుకురావాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఇది కమర్షియల్‌గా సాధారణ వినియోగదారుల మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పైగా గాల్లో ఎగిరే కార్లు సాధారణ రోడ్లపై నడపడానికి పబ్లిక్ రోడ్ పర్మిషన్లతో పాటు కఠినమైన ఏవియేషన్ నిబంధనలు (FAA అనుమతులు) వర్తిస్తాయి కాబట్టి, ప్రభుత్వం వీటికి ఎప్పటికి అనుమతిస్తుందనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.









