‘పెద్ది’ రొమాంటిక్ సీన్స్ వివాదం: స్పందించిన రంగమ్మత్త అనసూయ భరద్వాజ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ రోల్‌, రొమాంటిక్ సీన్స్‌పై వస్తోన్న విమర్శలు, వివాదాలపై ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఆసక్తికరంగా స్పందించారు. సమాజంలో జరిగే సంఘటనలకు సినిమాలను ముడి పెట్టొద్దంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. సినిమా అనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని, అందులోని తప్పొప్పులను నిర్ణయించుకునే పూర్తి విచక్షణ కేవలం ప్రేక్షకులపైనే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

పాత రోజుల్లో కథల వల్ల నైతికత కనిపించేదని, హీరో పాత్రలు స్ఫూర్తినిస్తే, విలన్ పాత్రలు అనుకరించకూడదనే స్పష్టత ఉండేదని అనసూయ గుర్తుచేశారు. కానీ ఈ రోజుల్లో పాత్రలను గొప్పగా చూపించే క్రమంలో దర్శకులు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. సినిమా అనేది ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉండాలని, క్రియేటివిటీ విషయంలో వచ్చిన తేడాల వల్ల తాను గతంలో కొన్ని షోల నుంచి తప్పుకున్నానని, దానివల్ల అవకాశాలు తగ్గినప్పటికీ తన సిద్ధాంతాల కోసమే నిలబడ్డానని ఆమె స్పష్టం చేశారు.

క్రియేటివ్ ఫ్రీడమ్‌తో పాటు సామాజిక స్పృహ కూడా అంతే ముఖ్యమని అనసూయ పేర్కొన్నారు. సినిమాలు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని ఆశించలేమని, అలాగని సమాజంలో జరిగే ప్రతి చెడు విషయానికి సినిమాలను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇలాంటి పాత్రల చిత్రణపై ప్రశ్నించడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం సంతోషకరమని, అవసరమైనప్పుడు తప్పులను ప్రశ్నించడం అంటే సృజనాత్మకతపై దాడి చేయడం కాదని, అది కేవలం సామాజిక అవగాహన పెంచడం మాత్రమేనని ఆమె వివరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు