నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘#NBK111’ నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు (జూన్ 19) కాజల్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమాలో ఆమెకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
సాధారణంగా సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో కనిపించే కాజల్, ఈ పోస్టర్‌లో మాత్రం పక్కా డీసెంట్ అండ్ ఇంటెన్సివ్ లుక్‌లోకి మారిపోయి సర్ప్రైజ్ ఇచ్చింది. నీలిరంగు గళ్ళ చీర కట్టుకుని, కళ్లద్దాలు పెట్టుకుని, జుట్టు ముడివేసి ఒక పవర్‌ఫుల్ ప్రభుత్వ అధికారిణిలాగా లేదా ఒక సీరియస్ లాయర్ తరహాలో ఆమె కనిపిస్తోంది. ఆమె వెనుక ఉన్న పాత కాలం నాటి ఆఫీస్ సెటప్, టేబుల్‌పై ఉన్న ఫైళ్లు గమనిస్తే.. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్‌కు కథ పరంగా చాలా ప్రాధాన్యత ఉందని స్పష్టమవుతోంది.
గతంలో బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో టాలీవుడ్‌లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.









