నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఆయన అర్ధాంగి శిరీష పండంటి మగబిడ్డకు జన్మించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త తెలియగానే నారా, నందమూరి కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కొత్త దంపతులకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నారా రోహిత్, శిరీషలది ప్రేమ వివాహం. ‘ప్రతినిధి 2’ చిత్రంలో కలిసి నటించినప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2025 అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లయిన ఏడాదిలోపే తమ బంధానికి గుర్తుగా వారసుడు రావడంతో రోహిత్ ఇంట సంతోషం రెట్టింపైంది.

మరోవైపు నారా రోహిత్ కెరీర్ పరంగానూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘సుందరకాండ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరాకు విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలా ఒకవైపు తండ్రిగా కొత్త బాధ్యతలను స్వీకరిస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతూ రోహిత్ డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు