పుణే హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్..!

పుణేలోని లోహగడ్ కోటపై జరిగిన హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ (20), తన బాయ్‌ఫ్రెండ్ చేతన్ చౌదరిని అప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారం బయటపడింది. పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్‌తో (25) ఆమెకు నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ వివాహం జరగడం గమనార్హం.

 

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. సుమారు నాలుగు నెలల క్రితం సియా, చేతన్ ఒక స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి సియా కాలేజీ స్నేహితులు ఇద్దరు సాక్షులుగా సంతకాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రహస్య వివాహాన్ని నిర్ధారించుకునేందుకు పోలీసులు మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం గాలిస్తున్నారు.

 

ఈ జంట పెళ్లి దండలతో ఉన్న కొన్ని ఫొటోలను ఒక ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డిలీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఫొటోలను తిరిగి పొందేందుకు టెక్నికల్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఫొటోలు దొరికితే కేసులో ఇవి కీలక ఆధారాలుగా మారనున్నాయి.

 

ఈ ఏడాది నవంబర్‌లో కేతన్, సియాల వివాహం ఉదయ్‌పూర్‌లో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కేతన్ కుటుంబ సభ్యులు సియా డాక్యుమెంట్లు అడగడంతో రహస్య వివాహ విషయం బయటపడుతుందనే భయంతోనే హత్యకు ప్లాన్ వేగవంతం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తప్పనిసరి పబ్లిక్ నోటీసును తప్పించుకుని, రహస్య వివాహాన్ని త్వరగా పూర్తి చేయడానికి చేతన్ ఏమైనా మధ్యవర్తికి డబ్బులు చెల్లించాడా? అనే కోణంలో అతని బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

 

కేతన్ అగర్వాల్‌తో పెళ్లి ఇష్టం లేని సియా, జూన్ 18న అతడిని లోహగడ్ కోటకు తీసుకెళ్లి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు