చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఉన్న జిన్జియాంగ్ అనే చిన్న నగరం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద షూ తయారీ హబ్‌గా (Shoe Capital of China) అవతరించింది. ఏటా ఇక్కడ 100 కోట్లకు పైగా షూలు తయారవుతుండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మొత్తం అథ్లెటిక్ ఫుట్‌వేర్‌లో కేవలం ఈ ఒక్క నగరం నుంచే ఐదో వంతు (20%) మార్కెట్‌కు సరఫరా అవుతోంది. తయారీ రంగంలో (Manufacturing sector) ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్న భారతదేశం లాంటి దేశాలకు జిన్జియాంగ్ ప్రగతి ప్రస్థానం ఒక అద్భుతమైన కేస్ స్టడీగా నిలుస్తుంది.
ఈ ప్రాంతంలో ఫుట్‌వేర్ విప్లవం 1979లో చాలా సాదాసీదాగా ప్రారంభమైంది. యాంగ్డాయ్ గ్రామానికి చెందిన లిన్ టుచియ్ అనే వ్యక్తి తన పాత ఇంటిని ఒక చిన్న ఫుట్‌వేర్ వర్క్‌షాప్‌గా మార్చడంతో ఇక్కడ తొలి అడుగు పడింది. మరో 14 మంది గ్రామస్థులను భాగస్వామ్యులను చేసి, అందరూ కలిసి తలా 2 వేల యువాన్ల పెట్టుబడితో ఒక చిన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ సమయంలో చైనాలో వస్తువుల కొరత ఎక్కువగా ఉండటంతో వీరు తయారు చేసిన షూలు 160 శాతం భారీ లాభాలతో అమ్ముడయ్యేవి. విదేశాల్లో స్థిరపడిన స్థానికుల ఆర్థిక సాయం, వ్యవసాయం లాభసాటిగా లేక ప్రత్యామ్నాయం వెతుకుతున్న గ్రామీణ కూలీల శ్రమ తోడవ్వడంతో ఈ రంగం వేగంగా విస్తరించింది.
కాలక్రమేణా నైకీ, అడిడాస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడి తక్కువ ఉత్పత్తి వ్యయానికి ఆకర్షితులై దశాబ్దాల పాటు జిన్జియాంగ్ నుంచి తమ ఉత్పత్తులను బ్రాండింగ్ చేసుకున్నాయి. అయితే 1999 తర్వాత చైనా ప్రభుత్వం అందించిన భారీ పన్ను రాయితీలు, స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాల కారణంగా ‘అంటా స్పోర్ట్స్’ వంటి సొంత చైనీస్ బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ చిన్న వర్క్‌షాప్‌ల నుండి కార్పొరేట్ సంస్థల వరకు దాదాపు 7,000 అనుబంధ తయారీ సంస్థలు ఉన్నాయి. సింథటిక్ లెదర్, రబ్బర్ సోల్స్, లేసులు మరియు ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ముడిసరుకులన్నీ ఒకే పరిసర ప్రాంతంలో లభించడం, ప్రభుత్వమే టెస్టింగ్ హబ్‌లు ఏర్పాటు చేయడం జిన్జియాంగ్ను ప్రపంచంలోనే తిరుగులేని షూ రాజధానిగా నిలబెట్టాయి.









