రైతన్నకు భారీ ఊరట!…రూ.5,000 తక్షణ కరువు సాయం ప్రకటించిన మహారాష్ట్ర సర్కార్..
ప్రతీ రైతు ఖాతాకు ఐదు వేలు జమ..
` Oct 15` TODAY 9 NEWS
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతాంగాన్ని అదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం వేచి చూడకుండా అన్నదాతలకు తక్షణ ఊరట కల్పించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు రూ.5,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా దీపావళి పండుగ కంటే ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ (DBT) ద్వారా జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలలోనే స్వయంగా కరువు ప్రభావిత జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి, రైతన్నలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ సహాయక ప్యాకేజీని అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాలకు గాను సుమారు 34 జిల్లాల పరిధిలోని 305 తాలూకాలను ప్రభుత్వం ఇప్పటికే కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఇది రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 75 శాతం కావడం గమనార్హం. మరాఠ్వాడా, విదర్భ, ఉత్తర మహారాష్ట్ర, పూణె రెవెన్యూ డివిజన్లలో వర్షాభావం తీవ్రంగా ఉండగా.. ముఖ్యంగా సోలాపూర్ జిల్లాలో సాధారణ వర్షపాతంలో కేవలం 48 శాతమే నమోదు కావడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం తో పాటు పంట రుణాల రికవరీని తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేయడం, విద్యుత్ బిల్లుల్లో రాయితీలు, తాగు-సాగు నీటి సౌకర్యాల కల్పన మరియు రైతు కుటుంబాల్లోని విద్యార్థుల పాఠశాల ఫీజుల మాఫీ వంటి పలు సమగ్ర ఉపశమన చర్యలను సైతం ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తోంది.
Post Views: 3









