మణుగూరు ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికే దక్కాలి
జాతీయ బొగ్గు గనుల వేలంపై కార్మికులు, ప్రజల్లో ఆందోళన..
D రమేష్, Today9News, ప్రతినిధి, మణుగూరు
జాతీయ బొగ్గు గనుల వేలంలో భాగంగా మణుగూరు ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణి కాలరీస్ కంపెనీకే కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపకపోతే మణుగూరు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని కార్మికుల్లోనూ, ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
దశాబ్దాలుగా బొగ్గు గనులపైనే ఆధారపడి జీవిస్తున్న మణుగూరు ప్రాంతానికి ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ జీవనాడి లాంటిది. ఈ బ్లాక్ ప్రైవేటు చేతుల్లోకి వెళితే స్థానిక ఉపాధి, అభివృద్ధి, సింగరేణి ఉనికే ప్రమాదం ఏర్పడుతుందన్నదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు .
నేతల కు వినతులు
ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు వినతి పత్రాలు అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మణుగూరు ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ ను సింగరేణికి దక్కేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు.
మణుగూరు ప్రాంత భవిష్యత్ పరిస్థితులను వివరిస్తూ, ఈ ప్రాంత అభివృద్ధికి ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి కేటాయించాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. సింగరేణి ద్వారానే వేలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోందని, ప్రైవేటీకరణ వల్ల అదంతా దెబ్బతింటుందని వినతిలో పేర్కొన్నారు.
ప్రజల నినాదం: “మన బొగ్గు మనకే”
మణుగూరు ప్రజలు ముక్తకంఠంతో ఈ డిమాండ్ ను వినిపిస్తున్నారు. “మన బొగ్గు మనకే దక్కాలి” అంటూ జెన్‌కో గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. “లాంగ్ లీవ్ మణుగూరు” అంటూ సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు, స్థానిక ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు.
సింగరేణి కార్మికులు గత 100 ఏళ్లుగా తమ చెమటతో ఈ సంస్థను నిలబెట్టారని, అలాంటి సంస్థకు చెందాల్సిన గనిని వేలంలో వదిలేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వంపై ఆశలు
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్రంతో చర్చలు జరిపి, ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ ను నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు. లేకుంటే మణుగూరు ప్రాంతం ఉపాధి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందన్న ఆందోళన వారిలో ఉంది.
మణుగూరు భవిష్యత్తు సింగరేణితోనే ముడిపడి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రంపై తగిన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు…









