మీరు నిజంగానే ధైర్యవంతులా? ఎవరూ లేని ఒంటరి ఇంట్లో ఒక రాత్రంతా సులువుగా గడపగలరా? అయితే అదే మీ ఉద్యోగ అర్హత. ఈ వింతైన ఉద్యోగం మన భారతదేశంలో లేదు కానీ జపాన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రస్తుతం విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఘోరమైన సంఘటనలు జరిగి, ఆ తర్వాత మూఢనమ్మకాల కారణంగా ఎవరూ కొనడానికి ముందుకు రాని ఇళ్లలో రాత్రి పూట నిద్రించడానికి అక్కడ ప్రత్యేకంగా మనుషులను నియమించుకుంటున్నారు. ఇలాంటి హాంటెడ్ ఇళ్లలో ఒక రాత్రి గడిపినందుకు గాను సదరు వ్యక్తులకు ఆయా ప్రాపర్టీల యజమానులు 88,000 యెన్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 52,000) చెల్లిస్తుండటం విశేషం.
జపాన్ దేశీయ పరిభాషలో ఇలాంటి నివాసాలను ‘జికో బుక్కెన్’ అని పిలుస్తారు. అంటే హత్యలు, ఆత్మహత్యలు, అగ్నిప్రమాదాలు జరగడం లేదా వృద్ధులు ఒంటరిగా మరణించి చాలా రోజుల వరకు ఎవరికీ తెలియకుండా ఉండిపోయిన ఇళ్లను ఇలా వ్యవహరిస్తారు. జపాన్ చట్టాల ప్రకారం.. ఏదైనా ఆస్తిని విక్రయించేటప్పుడు లేదా అద్దెకు ఇచ్చేటప్పుడు సదరు ఇంటికి ఉన్న ఇలాంటి దురదృష్టకరమైన గతాన్ని కొనుగోలుదారులకు కచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కారణంగా మూఢనమ్మకాలు కలిగిన చాలా మంది ప్రజలు అలాంటి ఇళ్లలోకి వెళ్లడానికి నిరాకరించడంతో అక్కడ వేలాది ఇళ్లు ఖాళీగా ఉండిపోతున్నాయి.
ఈ మానసిక భయాన్ని పోగొట్టడానికే రాత్రిపూట ఈ ఇళ్లలో పడుకోవడానికి ఉద్యోగులను నియమించుకుంటున్నారు. వీరు సదరు గృహాలలోకి వెళ్లి రాత్రంతా గడిపే సమయంలో అక్కడ కెమెరాలను, ఇతర అత్యాధునిక నిఘా పరికరాలను అమర్చి ప్రతి కదలికను నిశితంగా పర్యవేక్షిస్తారు. రాత్రంతా ఎలాంటి వింత సంఘటనలు లేదా భయానక పరిణామాలు జరగకపోతే.. సదరు ప్రాపర్టీలో ఎలాంటి దెయ్యాల సంచారం లేదని నిర్ధారిస్తూ వారు ఒక అధికారిక ‘ఘోస్ట్-ఫ్రీ’ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. ప్రస్తుతం జపాన్ ఎదుర్కొంటున్న హౌసింగ్ సంక్షోభం రీత్యా, ఇలాంటి అపవాదు ఉన్న ఇళ్లు సాధారణ గృహాల కంటే 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తుండటంతో.. భయాన్ని పక్కన పెట్టి తక్కువ బడ్జెట్‌లో ఇళ్లను వెతికే ఆధునిక యువత ఈ ఇళ్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది.









