భారతదేశంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుని, ఆపై విదేశాలకు వెళ్లి అక్కడ విడాకులు తీసుకోవడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం జరిగిన పెళ్లిని కేవలం భారతీయ కోర్టులు మాత్రమే రద్దు చేయగలవని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన శ్రీధర్‌రెడ్డికి 2003లో వివాహం కాగా, ఆ తర్వాత దంపతులు ఇంగ్లండ్ వెళ్లారు. మనస్తాపాల కారణంగా అతను ఏపీ కోర్టులో వేసిన విడాకుల పిటిషన్ కొట్టివేయబడటంతో, యూకే వెళ్లి అక్కడి కేంబ్రిడ్జి కౌంటీ కోర్టు ద్వారా 2014లో విడాకులు పొంది రెండో పెళ్లి చేసుకున్నాడు. దీనిపై మొదటి భార్య బహుభార్యత్వం (Bigamy) కింద కేసు నమోదు చేయగా, సదరు పోలీస్ చార్జిషీట్‌ను రద్దు చేయాలంటూ శ్రీధర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన ధర్మాసనం.. విదేశీ కోర్టులు ఇచ్చే విడాకుల డిక్రీలకు భారతీయ న్యాయవ్యవస్థ కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొంతమంది విదేశాల్లో ఏవో కాగితాలు చూపించి విడాకులు పొందితే, ఇక్కడి మహిళలకు అన్యాయం జరుగుతుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా తనకు ఎలాంటి పరిహారం వద్దని, భర్తే కావాలని మొదటి భార్య కోర్టుకు తెలపగా, ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.









