మెట్రో ప్రయాణికులకు భారీ ఊరట.. త్వరలో నెలవారీ, త్రైమాసిక పాస్‌లు!

హైదరాబాద్ మెట్రోలో నిత్యం ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులకు త్వరలోనే గొప్ప ఉపశమనం లభించనుంది. ప్రయాణికులపై పడుతున్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు నగరంలో ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే నెలవారీ (మంత్లీ) మరియు మూడు నెలల (త్రైమాసిక) పాస్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చిన ప్రత్యేక సూచనల మేరకు మెట్రో అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో విజయవంతంగా అమలవుతున్న బస్ పాస్‌ల విధానాన్ని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆర్టీసీ నమూనాను పరిశీలించి, మెట్రో ప్రయాణాలకు వీలుగా ప్రత్యేక పాస్‌ల విధివిధానాలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌లను సమకూర్చే దిశగా కూడా హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ అధికారులు తీవ్రంగా యోచిస్తున్నారు. ఈ కొత్త పాస్‌ల విధానం అందుబాటులోకి వస్తే నిత్యం మెట్రోలో రాకపోకలు సాగించే సామాన్యులకు మరియు ఉద్యోగులకు ఆర్థికంగా భారీ ఊరట కలగనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు