ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ..!

ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ సేవలకు శనివారం ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. సాంకేతిక లోపాల కారణంగా అమెరికా, భారత్, యూరప్, జపాన్‌ సహా పలు దేశాల్లోని వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉచిత వెర్షన్‌తో పాటు పెయిడ్ సబ్‌స్క్రైబర్లు సైతం ఈ సమస్యను ఎదుర్కోవడం గమనార్హం.

 

ఔటేజ్‌లను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ ప్రకారం, శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి సుమారు 1,500 మందికి పైగా యూజర్లు సమస్యలను రిపోర్ట్ చేశారు. వీరిలో దాదాపు 80 శాతం మంది చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌ పనితీరుపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా లాగిన్ కాకపోవడం, ప్రాంప్ట్‌లకు స్పందన రాకపోవడం, పాత చాట్ హిస్టరీ లోడ్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లలో కూడా ‘సర్వీస్ అందుబాటులో లేదు’ అనే సందేశాలు దర్శనమిచ్చాయి.

 

ఈ అంతరాయంపై చాట్‌జీపీటీ మాతృసంస్థ ‘ఓపెన్ఏఐ’ స్పందించింది. తమ అధికారిక స్టేటస్ పేజీలో సమస్యను గుర్తించినట్లు ప్రకటించిన సంస్థ, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టి సేవలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. అనంతరం కొద్దిసేపటికే సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం వ్యవస్థలన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయని సంస్థ స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు