అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌లు కలిగిన దేశాల జాబితాలో పాకిస్థాన్ నాలుగో స్థానంలో నిలిచింది. లండన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ సిటిజన్‌షిప్ సంస్థ ‘హెన్లీ అండ్ పార్ట్‌నర్స్’ విడుదల చేసిన తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఈ సూచీలో పాకిస్థాన్ 101వ ర్యాంకును మూటగట్టుకోగా.. దీనికంటే దిగువన కేవలం ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు మాత్రమే ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాక్ పౌరులు ముందస్తు వీసా లేకుండా కేవలం 29 దేశాలకు మాత్రమే ప్రయాణించే వీలుంది.
ఈ బలహీనమైన ర్యాంకింగ్‌కు తోడు ఇటీవలి కాలంలో పాక్ పౌరులపై పలు గల్ఫ్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. విదేశాల్లో భిక్షాటన, స్మగ్లింగ్, డ్రగ్స్ మరియు ఇతర నేర కార్యకలాపాల్లో పాకిస్థానీయుల ప్రమేయం పెరుగుతుండటంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలు పాక్ పౌరులకు వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేశాయి లేదా నిరవధిక నిషేధం విధించాయి. ప్రస్తుతం మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, డొమినికా వంటి కొన్ని దేశాలు మాత్రమే పాక్ పౌరులకు వీసా రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
మరోవైపు ఈ ప్రతిష్టాత్మక ఇండెక్స్‌లో గ్లోబల్ పవర్‌హౌస్‌గా సింగపూర్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలకు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా ప్రయాణించే వీలుండటంతో ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించింది. ఇక జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ దేశాలు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ తాజా నివేదికలో చైనా 60వ స్థానంలో నిలవగా.. భారతదేశం 81వ స్థానాన్ని సొంతం చేసుకుంది.









