ఏపీ జాబ్ కేలండర్-2026 కొత్త తేదీలు ఖరారు: నోటిఫికేషన్లు పకడ్బందీగా ఉండాలన్న మంత్రి నారా లోకేశ్!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. జాబ్ కేలండర్-2026 అమలుపై ఆయన అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. మొత్తం 10,060 పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించిన ఈ కమిటీ, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో ఎదురైన సాంకేతిక ఇబ్బందులు మరియు ఉద్యోగ సంఘాల వినతులను పరిగణనలోకి తీసుకుని రెండో దశ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ తేదీని సెప్టెంబర్ 15కు మార్చింది.

మొత్తం నాలుగు దశల్లో ఈ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి దశలో వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ ఏడాది మే 15నే నోటిఫికేషన్ జారీ చేయగా, రెండో దశ కింద భర్తీ చేయనున్న 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రెండో దశ పోస్టులలో అత్యధికంగా 2,225 ఖాళీలు హోంశాఖ (పోలీస్ అభ్యర్థులు) పరిధిలోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో గ్రూప్-1 విభాగంలో ప్రస్తుతం గుర్తించిన పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రుల బృందం అభిప్రాయపడింది.

మరోవైపు జాబ్ కేలండర్‌ను వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు, నాలుగు దశల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను ఒకేసారి అక్టోబర్ 15న విడుదల చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించిన మంత్రి.. ఈ నియామకాలకు సంబంధించిన పూర్తిస్థాయి ఖాళీల వివరాలను ఈ నెల 6న జరగనున్న కేబినెట్ సమావేశం ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, పి. నారాయణ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు