ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో ఉన్న అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, సాంకేతికతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ ప్రజలకు సులభతరమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) సెంటర్ నుంచి సోమవారం వివిధ శాఖల పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో డిజిటల్ సంస్కరణలు తీసుకురావడం ద్వారా దళారుల వ్యవస్థకు చెక్ పెట్టవచ్చని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో అధికారులు రవాణా శాఖలో ప్రవేశపెడుతున్న నూతన విధానాలను ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల్లోనే ‘డీమ్డ్ రిజిస్ట్రేషన్’ పూర్తి చేయడం, అత్యాధునిక ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్ ఏర్పాటు, ఫారం-5బీ వంటి పాత పరీక్షల తొలగింపు ద్వారా అవినీతిని అరికట్టవచ్చని తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని, దీనికోసం దశలవారీ ప్రణాళికను సిద్ధం చేశామని అధికారులు పేర్కొనగా, కాలయాపన లేకుండా ఈ నిబంధనలను వీలైనంత త్వరగా రద్దు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, తాగునీటి ఎద్దడిపై కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో తాగునీటి కొరత రాకుండా జలాశయాల్లోని నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి నదులకు వచ్చే వరద జలాలను సమర్థవంతంగా నిర్వహించి నిల్వ చేసుకోవాలన్నారు. అలాగే పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతా పరీక్షలు జరిపి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









