ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర అలజడి!

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పరిణామంలో డీఎంకే (DMK) కీలక నేత, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తంజావూరులో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ఉదయనిధిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో డీఎంకే నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి పోలీసు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించడంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో తోపులాట, తీవ్ర అలజడి నెలకొన్నాయి.
కావేరి జలాల వివాదంపై తంజావూరులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉదయనిధి స్టాలిన్ తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీపై, నటులు విజయ్ మరియు త్రిషలను ఉద్దేశించి అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. సభలో కొందరు నినాదాలు చేస్తున్న సమయంలో ఆయన చేసిన “ద్వంద్వార్థ (డబుల్ మీనింగ్)” వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడింది.
ఈ ఘటనపై టీవీకే నేతలు తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద భారీ బందోబస్తు మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులపై చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రతిపక్ష నేత అరెస్ట్ కావడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు