ట్రంప్ టారిఫ్ విధానాలకు బిగ్ షాక్: కోర్టును ఆశ్రయించిన 25 అమెరికా రాష్ట్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా వాణిజ్య నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. దేశ దిగుమతుల్లో అత్యధిక వాటా కలిగిన 60 దేశాలపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల విధించిన కొత్త సుంకాలు (టారిఫ్‌లు) పూర్తిగా చట్టవిరుద్ధమని వాదిస్తూ దాదాపు 25 డెమోక్రటిక్ రాష్ట్రాల కూటమి అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టును ఆశ్రయించింది. ఈ అదనపు పన్నుల వల్ల స్థానిక వ్యాపారాలతో పాటు సాధారణ వినియోగదారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆ రాష్ట్రాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి.

బలవంతపు కార్మిక విధానాలను అరికట్టడంలో విఫలమయ్యాయనే నెపంతో గత నెలలో ట్రంప్ యంత్రాంగం 60 దేశాలపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు అదనపు టారిఫ్‌లను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా భారత్‌తో పాటు మరో 16 దేశాలపై 10 శాతం సుంకాలను, మిగిలిన దేశాలపై 12.5 శాతం సుంకాలను ప్రతిపాదించి అమలు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందంటూ డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా నేతృత్వంలోని ఈ రాష్ట్రాల కూటమి ట్రంప్ విధానాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధ్యక్షుడి విఫల ఆర్థిక విధానాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోలేరని, సెక్షన్ 301ను దుర్వినియోగం చేస్తూ విధించిన ఈ అక్రమ పన్నులను తక్షణమే రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు