నిమ్స్‌లో 1000 రోబోటిక్ సర్జరీలు: దేశంలోనే కొత్త రికార్డ్!

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) వైద్య రంగంలో అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఏకంగా 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల్లో ఇదొక నూతన బెంచ్‌మార్క్ కాగా, సామాన్యులకు సైతం అత్యున్నత స్థాయి అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఈ ఘనత సాధించడంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలోని యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ మరియు అనస్థీషియాలజీ విభాగాల బృందాలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 1000 సర్జరీలలో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 248, అలాగే సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 ఆపరేషన్లు పూర్తి చేశాయి. ఈ అద్భుత ప్రగతిపై నిమ్స్ పాలకమండలి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మొత్తం రోబోటిక్ శస్త్రచికిత్సలలో 90 శాతానికి పైగా ఆపరేషన్లను పేద రోగులకు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకాల ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించడం విశేషం. రాడికల్ ప్రోస్టేటెక్టమీ, సంక్లిష్టమైన రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి క్లిష్టమైన ఆపరేషన్లను విజయవంతం చేశామని వైద్యులు తెలిపారు. రోబోటిక్ పరిజ్ఞానం వల్ల సర్జరీలలో కచ్చితత్వం పెరగడంతో పాటు రక్తస్రావం తగ్గి రోగులు వేగంగా కోలుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు