తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ కేసు విచారణకు తెరపడింది. సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తన విజ్ఞప్తిని తెలపగా, కోర్టు ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత, విజయ్‌తో వైవాహిక బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తకు మరో నటితో ఉన్న సంబంధం, ఆర్థిక ఆంక్షలు మరియు మానసిక వేధింపుల కారణంగా తమ దాంపత్య బంధం దెబ్బతిందని పిటిషన్లో ఆరోపించారు. జీవన భృతితో పాటు చెన్నై నీలంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా, ఈ కేసు విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
శుక్రవారం జరిగిన విచారణలో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు సంగీత ప్రకటించడంతో, విజయ్ తరఫు న్యాయవాది దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కేసును ‘విత్‌డ్రాన్’గా పరిగణించిన కోర్టు, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును సంగీతకు కల్పిస్తూ కేసును మూసివేసింది. ఈ అనూహ్య నిర్ణయంతో తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారానికి తాత్కాలికంగా ముగింపు లభించింది.









