కాలిఫోర్నియాలోని తూర్పు సియెర్రా నెవాడా పరిధిలోని ఇన్యో జాతీయ అటవీప్రాంతంలో ఒంటరిగా హైకింగ్ యాత్రకు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి విక్రమ్ ముబాయి మృతదేహం లభ్యమైంది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాంటా బార్బరా (UCSB)లో కెమికల్ ఇంజనీరింగ్ పీహెచ్‌డీ చేస్తున్న ముబాయి, ఆగస్టు 1న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన అనంతరం కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న ఇన్యో కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ, కాలిఫోర్నియా హైవే పెట్రోల్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టి, ఆగస్టు 3న అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
అనుభవజ్ఞుడైన హైకర్, క్రీడాకారుడిగా పేరుపొందిన విక్రమ్ ముబాయి మృతి వెనుక ఎలాంటి కుట్రపూరిత కోణాలు లేవని ప్రాథమిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. హాంకాంగ్‌లో పుట్టి పెరిగిన ముబాయి, గతంలో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. క్యాన్సర్ పరిశోధనల నిధుల సేకరణ కోసం న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు 4,500 మైళ్లు సైకిల్ యాత్ర చేసి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
పర్యావరణ సుస్థిరత, సింథటిక్ బయాలజీ రంగాలలో పరిశోధనలు కొనసాగిస్తూ ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను తగ్గించే దిశగా కృషి చేయాలనే లక్ష్యంతో ఉన్న ఒక ప్రతిభావంతుడైన యవ పరిశోధకుడు ఇలా అకాల మరణం చెందడం పట్ల తోటి విద్యార్థులు, వర్సిటీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆయన మృతికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి సమగ్ర విచారణ జరుపుతున్నారు.









