ప్రముఖ నటి, గాయని షెహనాజ్ గిల్ షూటింగ్ సెట్‌లో అనుకోని ప్రమాదానికి గురయ్యారు. ‘ఇష్క్‌నామా’ అనే పంజాబీ పీరియడ్ లవ్‌స్టోరీ షూటింగ్‌లో భాగంగా ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఆమె ముక్కు పుడక ప్రమాదవశాత్తూ నోట్లోకి జారిపోయి మింగేశారు. దర్శకుడు అరవింద్ ఖైరా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ సన్నివేశం కోసం షెహనాజ్ వేగంగా పరిగెడుతున్న సమయంలో పుడక ఊడిపోయి నోట్లో పడినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక దాన్ని మింగేసిన ఆమె తీవ్రంగా దగ్గడంతో సెట్‌లో ఆందోళన నెలకొంది. వెంటనే స్పందించిన సహనటుడు సౌరభ్ సచ్‌దేవా ఆమె వెనుక తట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోను షెహనాజ్ గిల్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌లో సరదాగా సాగుతున్న సన్నివేశం ఒక్కసారిగా భయానక అనుభవంగా మారడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఇష్క్‌నామా’ పంజాబీ, పాకిస్తానీ నేపథ్యాలతో తెరకెక్కుతున్న పీరియడ్ ప్రేమకథ. భారత పంజాబ్‌కు చెందిన సిక్కు కవి నిమ్మ, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన ముస్లిం యువతి నసీమా మధ్య సాగే ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. షెహనాజ్ గిల్‌తో పాటు జై రంధావా, సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బాత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు షెహనాజ్ నటించిన ‘సింగ్ వర్సెస్ కౌర్ 2’ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం షూటింగ్ సెట్‌లో జరిగిన ముక్కుపుడక ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.









