RD Burman Biopic: ఆర్‌డీ బర్మన్‌గా ఫర్హాన్ అఖ్తర్.. రాజేష్ ఖన్నాగా అక్షయ్ కుమార్?

భారతీయ సినీ సంగీతాన్ని సరికొత్త దిశలో నడిపించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్ జీవితం ఆధారంగా ఓ ప్రతిష్టాత్మక బయోపిక్ తెరకెక్కుతోంది. బాలీవుడ్‌లో అభిమానులు ప్రేమగా ‘పంచమ్ దా’ అని పిలుచుకునే ఆర్‌డీ బర్మన్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.డీ. బర్మన్ కుమారుడు. అలాగే లెజెండరీ గాయని ఆశా భోంస్లే భర్త. 1939లో జన్మించిన ఆయన 1994లో కన్నుమూశారు. 1960 నుంచి 1990 వరకు హిందీ సినీ సంగీతంపై తనదైన ముద్ర వేసిన ఆర్‌డీ బర్మన్.. భారతీయ శాస్త్రీయ సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్‌ను జోడించి సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు.

కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఎన్నో ఎవర్‌గ్రీన్ పాటలను అందించిన పంచమ్ దా.. ‘షోలే’, ‘యాదోంకీ బారాత్’, ‘అమర్ ప్రేమ్’, ‘1942: ఎ లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ప్రయోగాత్మక సంగీతం ఇప్పటికీ ఎంతోమంది కొత్త తరం సంగీత దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆర్‌డీ బర్మన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. దర్శకుడు నీరజ్ పాండే నేతృత్వంలో ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. ఆర్‌డీ బర్మన్‌కు అత్యంత సన్నిహితుడైన దివంగత సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా పాత్రలో అక్షయ్ కుమార్ ప్రత్యేక కామియోలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, బర్మన్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ హాస్యనటుడు మెహమూద్ పాత్ర కోసం నటుడు ఇమ్రాన్ హష్మీని సంప్రదించినట్లు సమాచారం. దీంతో ఈ బయోపిక్‌పై బాలీవుడ్‌లో ఆసక్తికరమైన బజ్ నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు