భారత ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిటిషన్పై అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు కీలక నివేదికను సమర్పించారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 543 లోక్సభ సభ్యుల్లో 251 మంది (ఇందులో 170 మందిపై తీవ్రమైన కేసులు), 233 మంది రాజ్యసభ సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా ప్రకటించారని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ్యులపై మొత్తం 4,192 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా ఎంపీలపై కేసుల శాతాన్ని పరిశీలిస్తే కేరళ 95 శాతం (20 మందిలో 19 మందిపై కేసులు)తో మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 82 శాతం (17 మందిలో 14 మందిపై కేసులు)తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఒడిశా (76%), జార్ఖండ్ (71%), తమిళనాడు (67%) ఉండగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సుమారు 50 శాతం మంది ఎంపీలపై కేసులు నమోదై ఉన్నాయి. అలాగే దేశంలోని 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టేందుకు హన్సారియా పలు కీలక సిఫార్సులు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు ఈ కేసుల ట్రయల్స్ ముగిసేవరకు ఇతర సాధారణ కేసులను చేపట్టకుండా కేవలం వీటిపైనే దృష్టి సారించాలని కోరారు. అంతేకాకుండా అభియోగాలు (ఛార్జీలు) ఖరారైన ఏడాది లోపు విచారణను పూర్తి చేయాలని, హైకోర్టులు ప్రతి నెలా వీటి పురోగతిని పర్యవేక్షించాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.









