ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘రాపో23’ (RAPO23) కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ చిత్రానికి హీరోగా నటించడమే కాకుండా స్వయంగా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టిన రామ్, పుదుచ్చేరి శివార్లలో ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొన్నారు. నటుడిగా తన పాత్రకు న్యాయం చేస్తూనే, దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన డెడికేషన్‌పై చిత్ర యూనిట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
పుదుచ్చేరిలో భారీ సెట్‌ను నిర్మించి దాదాపు తొమ్మిది రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణను జరిపారు. అయితే అక్కడ అనూహ్యంగా కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్‌కు ఆటంకం కలగడంతో చిత్ర బృందం తాత్కాలికంగా హైదరాబాద్‌కు తిరుగుపయనమైంది. త్వరలోనే మిగిలిన భాగాన్ని పూర్తి చేసేందుకు యూనిట్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది. అక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక గీతాన్ని, అలాగే ‘కేజీఎఫ్’, ‘కాంతార’ ఫేమ్ విక్రమ్ మోర్ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘రాపో సినిమాటిక్స్’ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం నియో-నోయిర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇందులో రామ్ ‘వీర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.









