అమెరికాలోని అలస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కేప్ న్యూయెన్‌హామ్ లాంగ్ రేంజ్ రడార్ సైట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో చిన్న చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండింగ్ సమయంలో పైలట్లకు రన్‌వే స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో పాటు విమానంలో ఉన్న మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
అలస్కాలోని ఎంకరేజ్‌కు పశ్చిమంగా సుమారు 725 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మారుమూల విమానాశ్రయంలో శుక్రవారం ప్రమాదం జరిగింది. రన్‌వే పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాన్ని సురక్షితంగా దించేందుకు పైలట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దృశ్యమానత తక్కువగా ఉండటంతో విమానంలోని నావిగేషన్ వ్యవస్థల సహాయంతో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
అయితే మొదటి ప్రయత్నంలో ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో పైలట్లు రెండోసారి ప్రయత్నించారు. ఈ సమయంలోనూ పొగమంచు తీవ్రంగా ఉండటంతో రన్‌వే పరిస్థితులను అంచనా వేయడం కష్టమైంది. రెండోసారి ల్యాండింగ్‌కు దిగుతున్న సమయంలో విమానం అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.









