అన్నా హజారే ఆరోగ్యం విషమం.. ముంబై ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ఆయన తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

అన్నా హజారేకు తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. దీనితో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు కూడా గురైనట్లు తెలిపారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ఆయన శారీరకంగా బలహీనపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ గౌతమ్ భన్సాలీ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

ముంబై ఆస్పత్రిలో వైద్యులు అన్నా హజారేకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తదుపరి అందించాల్సిన చికిత్సపై వైద్య బృందం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై త్వరలోనే అధికారిక మెడికల్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు