అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సీఈవోను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల అన్వేషణ కమిటీ సెప్టెంబర్ 1న ట్రస్ట్‌కు తన నివేదికను సమర్పించింది. సెప్టెంబర్ 2న ట్రస్ట్ కీలక సమావేశం నిర్వహించనుండగా.. ఈ భేటీ అనంతరం తొలి సీఈవో పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రామ మందిర ట్రస్ట్ తొలి సీఈవో పదవి కోసం భారీగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం 16 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరికి ఆగస్టు 3 నుంచి 6 వరకు ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు.
ఇంటర్వ్యూల ప్రక్రియ పూర్తయిన తర్వాత సెర్చ్ కమిటీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన తుది ప్యానెల్‌ను సిద్ధం చేసి ట్రస్ట్‌కు అందించింది. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు ఈ ముగ్గురిలో ఒకరిని తొలి సీఈవోగా ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో.. అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి CEO ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.









