2026 నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. కాగా దక్షిణ భారతదేశంలో వర్షాభావం మిగిల్చిన ప్రభావం మరింత స్పష్టమవుతోంది. తగ్గుతున్న జలాశయాల నిల్వలు, సాగునీటి కొరత, పంటలపై ఒత్తిడి… రాబోయే రబ సీజన్‌కు సవాల్‌గా మారుతున్నాయి.కేంద్ర జలసంఘం (CWC) గణాంకాల ప్రకారం దక్షిణ భారత జలాశయాల్లో గతేడాది 87.25% నిల్వలు ఉండగా, ఈసారి సుమారు 50%కే పరిమితమయ్యాయి.
💧 తెలంగాణ… తాగునీటికి ప్రాధాన్యం, సాగుకు పరిమితులు!
తెలంగాణలో సుమారు 235 మండలాలు కరువు తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. సింగూరులో 29.9 TMC సామర్థ్యానికి కేవలం 3.9 TMC (13%) మాత్రమే మిగిలింది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూ వ్యవసాయ విడుదలలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. యాసంగి సాగుపై అనిశ్చితి పెరుగుతోంది.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ–అన్నారం–సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రాథమికంగా ₹2,100 కోట్లు అవసరమని అంచనా. మరమ్మతులు పూర్తయి వ్యవస్థలు సురక్షితంగా పనిచేసేవరకు గోదావరి జలాల ఎత్తిపోతల సామర్థ్యంపై పరిమితులు కొనసాగవచ్చు.
💧 కృష్ణా బేసిన్… అడుగంటుతున్న జలాశయాలు!
అక్టోబర్ 11న శ్రీశైలంలో 215.81 TMC సామర్థ్యానికి కేవలం 69.01 TMC (32%) మాత్రమే ఉంది. ఇది సాగునీటి Minimum Drawdown Level (MDDL) వద్ద ఉండాల్సిన 89.29 TMC కంటే 20.28 TMC తక్కువ. అంటే కనిపిస్తున్న నిల్వలన్నీ సాధారణ పద్ధతుల్లో సాగుకు అందుబాటులో ఉన్న నీరు కాదనేది గమనార్హం .
తుంగభద్రలోనూ నిల్వలు 62.10 TMCకి తగ్గాయి. కొత్త ప్రవాహాలు లేకపోవడం ఆందోళనకరం. ఒక్క వారంలో శ్రీశైలం–తుంగభద్ర జలాశయాల్లో కలిపి 15.04 TMC నీరు తగ్గింది.
రాయలసీమలో … కాలువల నీరే పంటలకు ఆధారం!
తుంగభద్ర HLC –LLC ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వార్షిక కేటాయింపు 56.50 TMC. అక్టోబర్ 6 వరకు సంబంధిత సరిహద్దు కొలతల ప్రకారం చేరింది 11.062 TMC మాత్రమే. అంటే వార్షిక వాటాలో 19.6%. అయితే ఇది పూర్తి సంవత్సరపు కేటాయింపుతో ఇప్పటివరకు వచ్చిన నీటిని పోల్చారు .దీంతో అనంతపురం–కర్నూలు చివరి ఆయకట్టులో నిలిచిన పంటలకు కాలువల విడుదలలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో 388 మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించగా, వాటిలో 283 తీవ్రమైన కరువు వర్గంలో ఉన్నాయి. రాయలసీమలో వేరుశనగ, పత్తి, కంది, ఉద్యాన పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
🔷 కృష్ణా డెల్టాకు గోదావరి ఆసరా!
ఎగువ కృష్ణాలో నీటి కొరత కొనసాగుతున్నా, దిగువ గోదావరి కృష్ణా డెల్టాకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. పట్టిసీమ ద్వారా 2026లో సుమారు 57.70 TMC గోదావరి జలాలను కృష్ణా వ్యవస్థకు తరలించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. పథకం ప్రారంభం నుంచి 500 TMCలకు పైగా నీటిని తరలించినట్లు అంచనా.ఎగువ కృష్ణాలో కొరత… దిగువ గోదావరిలో లభ్యత! ఈ రెండింటి మధ్య పట్టిసీమ కీలక వారధిగా నిలుస్తోంది. అయితే ఈ నీరు కృష్ణా బేసిన్ మొత్తం కొరతను తీర్చలేదు అనేది నిర్వివాదాంశం .
కర్ణాటకలో అసమానత… తమిళనాడుకు ఈశాన్య రుతుపవనాలే కీలకం!
కర్ణాటకలో మొత్తం జలాశయాల నిల్వలు మెరుగ్గా కనిపిస్తున్నా, తుంగభద్ర వేగంగా తగ్గుతోంది. తమిళనాడులోనూ నిల్వలు తక్కువగా ఉండటంతో కావేరి ప్రవాహాలు, అక్టోబర్–డిసెంబర్ ఈశాన్య రుతుపవనాలు కీలకంగా మారాయి.కాగా అసలు సమస్య నీరు లేకపోవడమే కాదు… ఉన్న నీటిని అవసరమైన ప్రాంతాలకు సరైన సమయంలో అందించలేకపోవడం వల్ల ఉత్పన్నమౌతోంది.
ఇది ఇలా ఉంటే ఒక ప్రాంతంలో నీరు అందుబాటులో ఉండగా, మరో ప్రాంతంలో పంటలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. కొన్ని జలాశయాల్లో నిల్వలు కనిపిస్తున్నా, వాటిలో వినియోగించగల Live Storage పరిమితంగానే ఉంది. రాబోయే రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం పెంచడం కంటే తాగునీటి భద్రత, ఇప్పటికే సాగులో ఉన్న పంటల రక్షణ, Protective Irrigationకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది . నీరు ఎంత ఉందన్నది కాదు… ఎంత వినియోగించగలం? ఎక్కడ అవసరం? ఎప్పుడు అందించగలం? అన్నదే దక్షిణ భారతదేశం ముందున్న అసలైన సవాల్ అని చెప్పవచ్చు.
Post Views: 2









