ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి దాదాపు 40 ఏళ్లుగా టీడీపీతో కొనసాగిన బంధాన్ని వదులుకుంటున్న సందర్భంగా ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ పిలుపుతో తన భర్త, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ పార్టీలో చేరిన నాటి నుంచి తమ కుటుంబం పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పనిచేసిందని, అయితే ఇటీవల పార్టీలో తమకు, తమ అనుచరులకు తీవ్ర అవమానాలు ఎదురవుతుండటం వల్లే భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
తమ కుటుంబాన్ని, కార్యకర్తలను కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చివరకు తన భర్త విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మెలను కూడా కూల్చివేశారని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా పార్టీ వెంటే ఉన్నప్పటికీ, కనీస గుర్తింపు లభించకపోవడం, శ్రీకాకుళం మేయర్ పదవి కేటాయింపులో చోటుచేసుకున్న పరిణామాలు గుండ కుటుంబాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేశాయని స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో గుండ లక్ష్మీదేవి త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె తన ముఖ్య అనుచరులతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం అందుతోంది. నాలుగు దశాబ్దాలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో గట్టి పట్టున్న గుండ కుటుంబం టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరితే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మారే అవకాశముంది.
Post Views: 3









