ఏపీ స్థానిక పోరులో ఎస్‌ఈసీ కీలక నిర్ణయం: ఎన్‌వోసీ, నో డ్యూస్ నిబంధన రద్దు.. 19 మున్సిపాలిటీల్లో జాబితా తాత్కాలిక నిలిపివేత!

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC), నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధనను ఉపసంహరించుకుంది. ఎన్నికల చట్టంలో ఎన్‌వోసీ సమర్పించాలన్న నిబంధన ఎక్కడా లేదని స్పష్టం చేసిన కమిషన్, ఆ పత్రాలు లేవనే సాకుతో ఎవరి నామినేషన్‌నూ తిరస్కరించవద్దని అధికారులను ఆదేశించింది. మిగిలిన అవసరమైన ధ్రువపత్రాలు సక్రమంగా ఉంటే నామినేషన్లను వెంటనే స్వీకరించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేయకుండా అధికారులు కావాలనే ఎన్‌వోసీ, నో డ్యూస్ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ సంచలన నిర్ణయం వెలువరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో అధికార యంత్రాంగం నుంచి ధ్రువపత్రాల జారీలో జాప్యం ఎదుర్కొంటున్న ఆశావహులకు, ప్రతిపక్ష అభ్యర్థులకు పెద్ద ఊరట లభించినట్లయింది.

మరోవైపు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మరో కీలక చర్య చేపట్టారు. రాష్ట్రంలోని 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆయా ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు